Tuesday 12 June 2012

ధ్వన్యనుకరణ ప్రవీణుడు..


                  

                        ధ్వన్యనుకరణ ప్రవీణుడు..

                         మిమిక్రీ రమేష్‌

అతడు కడుపుబ్బా నవ్వించగలడు ,కన్నీళ్ళు పెట్టించగలడు,గంభీరంగా ఉన్నవాతావారణాన్ని తన హాస్యపుజల్లులతో తేలికపరచగలడు

సామాన్యప్రేక్షకుల నుండి మేధావులు,విద్యావంతులు,అధికారులు ,రాజకీయప్రముఖులను ఎవరినైనా తన కళతో మెప్పించగలడు .. వినయంలో రారాజుగా మిమిక్రీతో అందరివాడి గా మారి నేడు పల్లెనుంచి ప్రపంచస్థాయికి తన మిమిక్రీతో ఇంతింతై వటుడింతై అన్నచందంగా మిమిక్రీ కళలో తారాజువ్వలా దూసుకుపోతున్న కళాకారుడు జె.రమేష్‌, తన ఇంటి పేరును కూడా మిమిక్రీ గా మార్చుకుని మిమిక్రీ రమేష్‌ గా రాష్ట్ర,జాతీయ,ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి కళాకారుడిగా వెలుగొందుతున్నాడు మిమిక్రీ రమేష్‌.


(7-2-2012 )ఖమ్మం జిల్లా భద్రాచలం లో రాష్ట్రస్ధాయి నాటకోత్సవాల ముగింపు సభలో రమేష్‌ ను ఘనంగా సత్కరించి ,ధ్వన్యనుకరణ ప్రవీణ  బిరుదును ప్రదానం చేసింది భద్రాద్రి కళాభారతి సంస్థ ..


మారుమూల పల్లె అనిశెట్టిపల్లిలో జన్మించిన రమేష్‌ పాఠశాల స్థాయి నుంచే మిమిక్రీ కళను అవపోసన పట్టాడు .. ఆ రోజుల్లో నందమూరి తారకరామారావు గారికి వీరాభిమానిగా ఉన్న రమేష్‌ ఆయన హావభావాలు,ఆయనను అనుకరించడం మొదలు పెట్టారు .. చదువుకున్న పాఠశాల, కళాశాలల ఉపాధ్యాయులు,అధ్యాపకులను అచ్చం అలాగే అనుకరించి తన కళకు మెరుగులు దిద్దుకున్నారు.. ఓ రోజు కళాశాల లో ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరేళ్ళవేణుమాధవ్‌ మిమిక్రీ చూసి ఆయన స్ఫూర్తిగా  ఆయనకు ఏకలవ్యశిష్యుడిగా మారిపోయాడు ... బాల్యంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొని కన్నీళ్ళ నుంచి బాధల నుంచి విముక్తి పొందడానికి అందరిని నవ్విస్తూ తాను నవ్వుతూ మిమిక్రీ కళలో రాణించాడంటే అతిశయోక్తి లేదు .. స్వశక్తితో మిమిక్రీని నేర్చుకుని తనకు జన్మనిచ్చిన పల్లెతల్లికి గొప్పపేరును తీసుకొస్తున్నాడు.. ఎదుటివాళ్ళ ఎన్ని రాళ్ళు వేసినా వాటిని ఓపిక గా ఏరుకుని పునాది నిర్మించుకునే  తరహా మనస్తత్వంతో రమేష్‌ గత పాతిక సంవత్సరాలుగా మిమిక్రీ కళలో అనేక అవార్డులు రివార్డులు తన సొంతం చేసుకున్నారు. కష్టేఫలి అన్న సూక్తిని నమ్ముకుని మిమిక్రీ సౌధాన్ని నిర్మించుకున్నాడు.. ఎవరి హావభావాలనైనా మాటలను ప్రసంగాలను చూసి పది నిమిషాల వ్యవధిలో ఇట్టే అనుకరించే రమేష్‌ పాటలు పాడడం ,రాయడం లో కూడా ప్రావీణ్యం ఉంది అంటే అతను తన కళను ఎంతమెరుగు పరుచుకున్నాడో అర్థం అవుతుంది..  రమేష్‌ లా మిమిక్రీ చేస్తూ ,పాటలు పాడే అద్బుతమైన ప్రతిభ కలిగిన కళాకారులు రాష్ట్రంలో వేళ్ళమీద లెక్కించే స్థాయిలో ఉన్నారు.. రాజకీయనాయకులు, సినిమాహీరోలు,హాస్యనటులను అనుకరిస్తూ , ఎలాంటి సభలో నైనా ఆ సభకు అనువుగా తన కళను ప్రదర్శిస్తూ

సమయ స్ఫూర్తి,సందర్భోచిత సైటైర్లు ,అప్పటికప్పుడు తన మీద తానే జోకులు వేసుకుని హాస్యం,వ్యంగ్యంతో మనల్ని నవ్వించడం సామాజిక సమస్యలను జోడించి ,సమకాలీన పరిస్థితులపై పాటలు కూడా రాయడం,పాడడం, రమేష్‌ కు వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు ... కొత్తవారు పరిచయమైతే చాలు తాను పాతవాడిలా మారి వారి అభిమానాన్ని సాధించడం రమేష్‌ నైపుణ్యానికి నిదర్శనం.. సమకాలీన పరిస్థితులపై అప్పటికప్పుడు జరిగిన రాజకీయ,సామాజిక పరిస్థితులై వ్యంగ్యంగా  హాస్యం మేళవించి నవ్వులు పూయించగల హాస్యజీవి రమేష్‌.. చిన్నతనంలో పదిమందిని నవ్వించడానికి తాను నేర్చుకున్న మిమిక్రీ కళ రమేష్‌ ను జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై నిలబెట్టింది..

1999 లో దివంగత సినినిర్మాత డివిఎస్‌ రాజు రమేష్‌ మిమిక్రీ హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ లో చూసి అబ్బురపడి చెన్నయ్‌ లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్వంలో జరిగిన ఉగాది ఉత్సవాలకు రమేష్‌ ను ఆహ్వానించడం ,అక్కడ రమేష్ చేసిన మిమిక్రీ పలువురు ప్రముఖులను అలరించడం రమేష్‌ కు నూతన ఉత్సాహాన్ని మరిన్ని ప్రదర్శనలకు తోడ్పడింది.. వెనె వెంటనే అంటే 2000 సంవత్సరంలో విశాఖ పట్టణంలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 4 వ మహాసభల్లో రమేష్‌కు మరోసారి డివిఎస్‌ రాజు ఆహ్వానం పలికారు .. అక్కడ రమేష్‌ మిమిక్రీ చూసిన ప్రముఖ హాస్యనటుడు అల్లురామలింగయ్య విరగబడి నవ్వారు.. ఆ సభలో దేశవిదేశి ప్రముఖులు రమేష్‌ చేసిన మిమిక్రీ కు ఆనందంతో పరవశించి పోయారు.. ప్రపంచతెలుగు సమాఖ్య వేదికపై రెండు సార్లు మిమిక్రీ చేసిన వాడిగా రమేష్‌ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.. ఓ సారి తన ప్రదర్శన చూసి అభినందించిన ఓ ప్రముఖ నిర్మాత తన ను సినిమా రంగానికి ఆహ్వనించినా తాను పనిచేసే సంస్థను వదులుకోలేక సినిమా అవకాశాన్ని వదిలేసుకున్నారు..

--------------------------------

మహాత్మాగాంధి మనవరాలి అభినందన

-----------------------------

తన సోంత జిల్లా ఖమ్మంలో ని వేపలగడ్డ అనే గ్రామంలో జరిగిన గ్రామకళ్యాణ యజ్ఞం కార్యక్రమానికి హాజరైన మహాత్మగాంధి మనవరాలు ,రాజ్యాంగ సమీక్ష కమీషన్‌ సభ్యురాలు (అప్పటి) సుమిత్రాగాంధి కుల్‌కర్ణి రమేష్ చేసిన మిమిక్రీలో తన తాత గొంతు విని ఆశ్చర్యపోయి తాను 18 సంవత్సరాల వయస్సులో తన తాత మాటలు విన్నానని ఇపుడు రమేష్‌ మిమిక్రీలో వినడం గొప్పగా ఉందంటూ రమేష్‌ ను ఆ సభలో అభినందించారు.. 
 

అమెరికా అవకాశం....

------------

2001 సంవత్సరంలో  పాల్వంచలో జరిగిన ఓ కార్యక్రమంలో రమేష్‌ మిమిక్రీ చూసిన ప్రవాసాంధ్రుడు నన్నపనేని మోహన్‌ 2003 తానా సభలకు ఆహ్వానించారు.. ఆ రోజుల్లో రమేష్‌ కు వీసా అందక పోవడంతో  తీవ్రనిరాశకు లోనయ్యడు .. నిరాశలో ఉన్న రమేష్‌ కు మోహన్‌ ఫోన్‌ చేసి ఎప్పటికైనా నీకు అమెరికాలో అవకాశం కల్పిస్తాను నువ్వ నీ మిమిక్రీ కళ ను కొనసాగించు అని అభయమిచ్చాడు.. మోహన్‌ అభయంతో మిమిక్రీ కళను మరింత మెరుగుపరుచుకుని తాను నమ్మకున్న కళాబాటలో పయనించాడు రమేష్‌..

ఫేసుబుక్‌ కువైట్‌ ,కొల్‌కతా తీసుకెళ్ళింది...

-----------------------

సోషల్‌ నెట్‌వర్క్‌ అయి న ఫేసుబుక్‌ మిమిక్రీ రమేష్‌ ను 2010 కతా తీసెకెళ్ళింది... అదేంటి ఫేస్‌బుక్‌ కువైట్‌ ,కొల్‌కతా తీసుకెళ్ళడమేమిటని ఆశ్చర్యపోతున్నారా... అవునండి రమేష్‌ ఫేసుబుక్‌ లో మిమిక్రీరమేష్‌ పేరుతో తన ఖాతా ప్రారంభించిన రమేష్‌ కు ఆ ఫేస్‌బుక్‌ లో చిట్టూరి రవీందర్‌ అనే సాఫ్టవేర్‌ ఇంజనీర్‌ రమేష్‌ ప్రోఫైల్‌ ,రమేష్‌ ప్రదర్శనల జాబితా ఫోటోలను చూసి కొల్‌కతా లో జరిగిన ఆంధ్రాఅసోషియేషన్‌ 75 వసంతాల వేడుకలకు ఆహ్వానించారు..

అలాగే అదే ఫేసుబుక్‌లో కువైట్‌ కు చెందిన మరో తెలుగు ప్రముఖుడు మురళీమనోహర్‌ అన్నదాత తన సంస్థ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు మిమిక్రీ చేయాలని రమేష్‌ను ఆహ్వనించారు..తన కు ఇంత ప్రాముఖ్యతను కల్పించిన ఫేస్‌బుక్‌ కు రమేష్‌ కృతజ్ఞతలు తెలిపారు వినమ్రంగా....

2011 లో న్యాట్స్‌ సభలకు మిమిక్రీరమేష్‌

-----------------------------

2011 జులై నెలలో జరిగిన ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (న్యాట్స్‌) నిర్వహించిన సభల్లో రమేష్‌ ను ఆహ్వనించారు..

ప్రముఖ గజల్‌ గాయకులు గజల్‌శ్రీనివాస్‌ ద్వారానే తనకు న్యాట్స్‌ ఆహ్వానం వచ్చిందని రమేష్‌ చెబుతారు.. తన ప్రదర్శన చూసిన గజల్‌ శ్రీనివాస్‌ తనకు అమెరికా లో అవకాశం కల్పిస్తానని హామి ఇచ్చి తనకు అమెరికా వెళ్ళడానికి అరుదైన అవకాశం కల్పించారు..అంటూ ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు రమేష్‌.. న్యాట్స్‌ సభల్లో తన మిమిక్రీ కి అనూహ్యస్పందన వచ్చిందని రమేష్‌ తెలిపారు.. 

భవిష్యత్‌ లో మిమిక్రీ శిక్షణాసంస్థ

--------------------

మిమిక్రీకళలో ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నానని ,తన అనుభవాలు పుస్తక రూపంలో తీసుకు వస్తానని

మిమిక్రీ రమేష్‌ తెలిపారు.. నేటి యువతరం కళల పట్ల ఆకర్షితులు అయ్యేందుకు కృషిచేసి సమాజానికి ఉపయోగపడే కళాసైనికులుగా వారిని తీర్చిదిద్దుతానని రమేష్‌ ప్రకటించారు..

పలువురు సిని ,రాజకీయ ,అధికార అనధికారులు అభినందించిన మిమిక్రీరమేష్‌ నిరంతర విద్యార్థిగా మిమిక్రీ కళలో కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు వెళుతున్నాడు.. పలు సంస్థల నుంచి అనేక బిరుదులు సొంతం చేసుకున్నాడు..

హైదరాబాద్‌ లో ఓ ఛానెల్‌ లో మిమిక్రీ కళాకారుడుగా పనిచేస్తున్న మిమిక్రీ రమేష్‌కు ఖమ్మం జిల్లాతో పాటు ,రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పలువురు అభిమానులు ఉన్నరంటే అతిశయోక్తి కాదు..

ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ నవ్వుతూ నవ్విస్తున్న రమేష్‌ తన కళలో మరింత స్థాయికి ఎదిగి అనేక అవార్డులు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం..
------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment