ధ్వన్యనుకరణ చక్రవర్తి
" చతుషష్టి కళల్లో స్వర
 వంచన లేదా అనుకరణ కూడా ఒకటి. మన పురాణాల్లో ఇదొక ముఖ్యమైన అంశంగా 
కనిపిస్తుంది. మహాభారతంలోని కీచక వధ ఘట్టంలో కీచకుణ్ణి తప్పుదారి 
పట్టించడానికి భీముడు సైరంధ్రి ( ద్రౌపది ) గొంతుతో మాట్లాడుతాడు. 
రామాయణంలో అహల్య శాపం ఘట్టంలో గౌతమ మహర్షిని వంచించడానికి ఇంద్రుడు కోడిలాగ
 కూస్తాడు. మాయలేడి రూపంలో మారీచుడు సీతను నమ్మించడానికి రాముడి గొంతుతో 
'హా లక్ష్మణా' అని అరుస్తాడు " అని మిమిక్రీ పుట్టుపూర్వోత్తరాల 
గురించి వివరిస్తారు ధ్వన్యనుకరణ చక్రవర్తి పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ 
గారు. 
" సంగీతానికి, నృత్యానికి, చిత్రలేఖనానికి, నటనకు ఇలా అన్నిటికీ 
పాఠ్యప్రణాళికలున్నాయి.... ఒక్క అనుకరణ కళకు తప్ప. ఆ కళకు వేణుమాధవ్ గారే 
సిసలైన సిలబస్ " అని కితాబిచ్చారు ప్రముఖ నటులు స్వర్గీయ చిత్తూరు వి. 
నాగయ్య గారు.
" మిమిక్రీ అనేది చాలా క్లిష్టమైన కళ. దాన్ని మీరు ప్రతిభావంతంగా సొంతం 
చేసుకున్నారు " అని వేణుమాధవ్ గారిని ప్రశంసించారు అప్పటి రాష్ట్రపతి 
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.   
 అనుకరణ అనేది అనుకున్నంత సులువు కాదు. ఎదుటివారి హావభావాలను పరిశీలించాలి 
 వాచికాన్ని పట్టుకోవాలి. తర్వాత కఠోర సాధన చెయ్యాలి.
ఒక సంగీత కళాకారుడు కార్యక్రమం చెయ్యాలంటే తనకో వాయిద్యమో లేక ప్రక్క 
వాయిద్యాల తోడ్పాటో అవసరం. ఒక నృత్య కళాకారునికి ఆహార్యం, గాయకులూ, 
వాయిద్యాలు ఇవన్నీ అవసరం. కానీ మిమిక్రీ చెయ్యడానికి కళాకారుడికి ఏవిధమైన 
సాధనాలు అవసరం లేదు. అతని స్వరమే అతని సాధనం. అతని నటనే అతని వాయిద్యం. తన 
స్వరంతో అతను ప్రేక్షక శ్రోతల్ని ఆయా సన్నివేశాలను అతని కళ్ళెదుట 
సాక్షాత్కరింపజేస్తాడు. ఇప్పుడు టాకింగ్ డాల్ లాంటి బొమ్మల్ని, ఇతర 
సాధనాలని వాడుతున్నా అతని స్వరానికే ప్రాముఖ్యత ఎక్కువ.
మిమిక్రీ కళకు చక్రవర్తి పద్మశ్రీ  నేరెళ్ళ వేణుమాధవ్ 
మిమిక్రీ కళా తపస్వి పద్మశ్రీ  నేరెళ్ళ వేణుమాదవ్ గారు
ఆంధ్రదేశంలో అనేకమంది మిమిక్రీ నేర్చుకోవడానికి  స్పూర్తి ప్రదాత వేణుమాధవ్
 గారు
ఎదుటి వాళ్ళను ఎగతాళి చేసేందుకు కాకుండా అనుకరణ ఆనందపరిచే కళగా ఎదిగేందుకు 
కృషి చేసిన మహానుభావుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారు. 
ఆయన మిమిక్రీలో అనుకరణ మాత్రమే కాక ఏకపాత్రాభినయం, బహుపాత్రాభినయం, 
ధ్వన్యనుకరణ మిళితమై వుంటాయి. ఇంకా చెప్పాలంటే రంగస్థలం మీద ఉండేది 
ఆయనొక్కరే ! ఆయన ఆహార్యం సామాన్యమైనదే ! అక్కడ రంగాలంకరణలు, వస్తు సామగ్రి 
వగైరాలేవీ వుండవు. కానీ  పాండవోద్యోగ విజయాలు, కన్యాశుల్కం, విప్రనారాయణ, 
ప్రహ్లాద నాటకాల్లోని ఘట్టాలు, మెకన్నాస్ గోల్డ్, టెన్ కమాండ్మెంట్స్, 
హామ్లెట్, మాక్బెత్, జూలియస్ సీజర్, బెన్ హర్ లాంటి ఆంగ్ల చిత్రాల్లోని 
సన్నివేశాలు నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తో సహా తన స్వరంతో వినిపించి
 శ్రోతల్ని కాసేపు ప్రేక్షకులుగా మార్చేస్తారు.
 
ఆయన కార్యక్రమం ...  ఆ కాసేపు ఏదో లోకంలో విహరింపజేశారు. ఆయన సృష్టించే శబ్దాలు, 
సన్నివేశాలు అప్పట్లో మమ్మల్ని ఆశ్చర్య చకితుల్ని చేసాయి. తర్వాత 1975  లో 
హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ ప్రథమ తెలుగు మహాసభలలో అప్పుడప్పుడు వచ్చి ఆయన 
తన మిమిక్రీతో అలరిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ మహాసభలకు ప్రతినిధిగా హాజరైన 
నాకు ఆయన మిమిక్రీని ఎక్కువసార్లు ఆస్వాదించే భాగ్యం కలిగింది.   
నేరెళ్ళ వేణుమాధవ్ గారి పేరు మిమిక్రీకి పర్యాయపదంగా మారిందంటే అతిశయోక్తి 
కాదు. ఆయన స్పూర్తితో ఎంతోమంది మిమిక్రీ కళాకారులు ఆంధ్రదేశంలో 
ఉద్భవించారు.  ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. నిగర్వి. 
చాలాకాలం తర్వాత 2002 సంవత్సరంలో రవీంద్రభారతి ఆవరణలో వున్న 
సాంస్కృతిక మండలి కార్యాలయానికి వెళ్ళిన అప్పటి 
సాంస్కృతిక మండలి కార్యదర్శి శ్రీ గోటేటి రామచంద్రరావు గారు వేణుమాధవ్ 
గారిని పరిచయం చేశారు. అప్పటికే పద్మశ్రీనందుకున్న అంత పెద్ద కళాకారుడు 
ఏమాత్రం భేషజం లేకుండా హాయిగా చాలా విషయాలు మాట్లాడారు. అందుకే అంటారు  ఏమీ
 లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని.... అన్నీ ఉన్న ఆకు అణిగే ఉంటుందని. ఏమీ 
లేని ఆకులతో అప్పటికే కొన్ని అనుభవాలు వుండడం ఈ సామెతలోని నిజం 
ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించబడ్డ ఏకైక భారతీయ
 కళాకారుడు వేణుమాధవ్ గారు. అక్కడ షేక్స్పియర్ ' హామ్లెట్ ' నాటకంలోని 
అంశాలతో బాటు ' ఒథెల్లో ' లోని సన్నివేశాలను ప్రదర్శించిన తీరు అందరి 
ప్రశంసలు పొందింది. ఆయన కీర్తి కిరీటంలో అదొక కలికి తురాయి. అలాగే ముంబై లో
 జరిగిన హరింద్రనాథ్ చటోపాధ్యాయ జన్మదిన సంబరాల్లో ఆయన ప్రదర్శించిన 45  
నిముషాల పాటు సాగిన ' ఆంగ్ల భాషా ఉచ్చారణ ' కార్యక్రమం నభూతో నభవిష్యతి. 
వివిధ దేశాలు, ప్రాంతాలలోని ప్రజలు ఆంగ్లాన్ని ఉచ్చరించే తీరు ఆయన తన 
మిమిక్రీలో పలికించడం వర్ణనాతీతం.
వి. వి. గిరి గారు రాష్ట్రపతిగా వున్న రోజుల్లో రాష్ట్రపతి భవన్ లో శ్రీమతి
 సరస్వతీ గిరి రాసిన పద్యాలను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 
స్వరంతో చదివి వినిపించగా అక్కడ జరిగిన ప్రత్యేక సన్మానం ఆయన ప్రతిభకు 
నిదర్శనం. అంతకంటే చెప్పుకోదగింది వేణుమాధవ్ గారి కళానైపుణ్యానికి 
ముగ్ధులైన కవిసామ్రాట్ తన ' శివార్పణం ' కావ్యాన్ని ఆయనకు అంకితం ఇవ్వడం. 
ఇలాంటి గౌరవాలెన్నో ఆయన అందుకున్నారు. దేశ విదేశాలలో ఎన్నో ప్రతిష్టాకరమైన 
ప్రదర్శనలిచ్చారు. అవన్నీ చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. 
మీ సమయంలో ఒక సెకను కూడా వేణుమాధవ్ గారికి ఇవ్వకండి. ఇచ్చారో మరుక్షణం 
ఆయన మిమ్మల్ని అనుకరించేస్తారు..... ఇదీ వేణుమాధవ్ గారంటే ఆయన 
అభిమానులకు... అభిమానంతో కూడిన భయం.
మిమిక్రీ కళలో వేణుమాధవ్ గారు చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చెయ్యలేదు. ఆయన 
వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శిష్యులలో అగ్రగణ్యుడు మిమిక్రీ శ్రీనివాస్. 
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కూడా వేణుమాధవ్ గారి శిష్యుడే ! ఇలాంటి
 అద్భుతమైన శిష్యులనెందరినో తయారు చేసి వేణుమాధవ్ గారు మిమిక్రీ కళను 
సుసంపన్నం చేసారు.  
పద్దెనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసిన వేణుమాధవ్ గారు పి. వి. 
నరసింహారావు గారి ప్రభుత్వంలో విధానమండలి సభ్యునిగా కూడా పనిచేశారు. 1932  వ
 సంవత్సరంలో డిసెంబర్ 28  వ తేదీన జన్మించిన వేణుమాధవ్ గారు. ఆయన జన్మదినం మిమిక్రీ కళాకారులందరికీ పండుగ. ఈరోజు 
వారందరూ ఆయన స్వస్థలమైన వరంగల్ చేరుతారు. అక్కడ జరిగే ఉత్సవంలో వేణుమాధవ్ 
గారు ప్రతీ సంవత్సరం ఒక కళాకారుణ్ణి సన్మానించి, జ్ఞాపికను బహుకరించడం 
ఆనవాయితీ.

 
 
No comments:
Post a Comment