సోమయ్య మిమి'క్రీడ’
  
                             
                              Sun, 27 Sep 2009, IST
                             
                             

కప్పల బెక బెకలు... చెప్పులు కిరకిరలు... పక్షుల్లా కిలకిలారావాలు చేస్తూ, వినసొంపైన డప్పు దరువుతో అందరినీ మంత్రముగ్ధలను చేస్తున్నాడు సోమయ్య. ఆర్థికస్తోమత లేక పదవ తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి, తనకున్న కళతో ధ్వని అనుకరణ మిమిక్రీ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ప్రాంతానికి చెందిన సోమయ్య, జూనియర్ బాబూమోహన్‌గా గుర్తింపు పొందాడు. వివిధపక్షులు, జంతువులు, అనేకధ్వనులను మిమిక్రీ ద్వారా ప్రదర్శిస్తూ ఉం టాడు. జానపదగీతాలను పాడుతూ, వినసొంపైన డప్పు దరువుతో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటాడు. ఇంకా తన చేతి వేళ్లు, పొట్టనే డప్పుగా మార్చి అద్భుతమైన చప్పుళ్లు చేసి చూపించి, అనేకుల మన్ననలను పొందాడు. ప్రభుత్వ-ప్రైవేటు పాఠశాలల్లో ప్రదర్శనలు ఇస్తూ, ఎంతో కొంత పారితోషికం పొంది, జీవనం సాగిస్తున్నాడు. ఎక్కడైనా నలుగురు ఉన్నప్పుడు తనను తానే పరిచయం చేసుకుని, తన కళను చూపిస్తుంటాడు. అతని కళకు చలించినవారు, తమ వంతు సహాయంగా అక్కడక్కడ ప్రదర్శనలను ఇప్పిస్తుండడంతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు.
యాభై శబ్దాల్లో మిమిక్రీ
గ్రామీణ ప్రకృతివాతావరణంలో ముడిపడి ఉన్న అనేకశబ్దాలు, రాగాలను అనుకరించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. 19 రకాల కప్పల అనుకరణ, బోరు వేసినట్లు, గాడిద, గుడ్లగూబ, కోయిల, జన్రెట్, సాంబర్ కాకి, టైరులో గాలిపోయినట్లు, లారీలు, బస్సులు వెనుకాముందూ, ఆంజనేయస్వామి ఉన్నట్లు, పాలపిట్ట, విమానం, కోడి పుంజు, కుక్క, ఐస్ క్రీం తింటున్నట్లుగా-ఇలా యాభైకి పైగా మిమిక్రీ శబ్దాలు చేయడంలో సోమయ్య దిట్ట.
డప్పు దరువుతో జానపదగీతాలు
శబ్దాలు, రాగాలను మిమిక్రీలో అనుకరించడమే కాదు, సొంతంగా జానపద గీతాలను రాసుకుని సోమయ్య పాడుతుంటాడు. అంగవైకల్యాన్ని తోసిరాజని, వినసొంపైన డప్పు దరువుతో జానపదగీతాలను అద్భుతంగా ఆలపిస్తుంటాడు. భలేతాత... నా చిట్టి చేతులు, చదువుంటే స్థైర్యానికి, చెట్టు మీద కోయిలమ్మ, నల్లంచు, కలుగోడు, కోర్కెల పిల్లా, రోజుకొక్క, పల్లెపల్లెకు చల్లని గాలులు, ఓలమ్మా... ఓలమ్మా, పిల్లా... నీ మీద మనసు, చీరల్ రైకల్ వంటి జానపదగీతాలతో పాటు దేశభక్తి గీతాలనూ మైమరపించే రీతిలో పాడుతాడు. ఈ పాటల్లో చదువు గురించి అవగాహన కల్పించే జానపదగీతాలను కూడా పాడుతూ పాటకు తగ్గట్లుగా నాట్యం చేస్తాడు.
అంగవైకల్యంతో పాటు... ఫిట్స్
సోమయ్యకు అంగవైకల్యమే కాదు మూర్ఛ వ్యాధి కూడా ఉంది. ఈ వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి మందులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
వైవిధ్యకళాప్రదర్శనలిస్తూ, ఆ వచ్చిన కొంత సొమ్ముతో జీవనాన్ని సాగిస్తున్న ఈ పేద కళాకారుణ్ని ప్రభుత్వం ఆదుకొని ప్రోత్సహించాలని, సోమయ్య అలియాస్ జూనియర్ బాబూమోహన్ కోరుకుంటున్నాడు. తన కళను పది మంది ముందూ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ-ప్రైవేటు పాఠశాలలు, సభలు, సమావేశాలు నిర్వహించే నిర్వాహకులను 91603 09485 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని కోరాడు
 
 
No comments:
Post a Comment