Tuesday 27 September 2011

SRI RAJU SRIVSTHAV STORY IN SAAKSHI

    

                                                నవ్వించడం ఏమన్నా నవ్వులాటా...


టిఆర్‌పిలు జారిపోతున్న రోజులవి. కొత్త చానెల్స్‌ను నిలబెట్టాలంటే కొత్త ప్రోగ్రామ్‌లు కావాలి. కొన్నేళ్ల క్రితం కొత్తగా మొదలైన ‘స్టార్ వన్’ చానెల్ అలాంటి కార్యక్రమం ఒకటి ప్లాన్ చేసింది. హాస్యం కరువైపోతున్న ఈ రోజుల్లో హాస్యం చూపిస్తే బాగుంటుందని- ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ ప్లాన్ చేసింది. దేశంలోని మిమిక్రీ ఆర్టిస్టులు ఒకరి వెంట ఒకరుగా వచ్చి హాస్యం ప్రదర్శించడం ఆ కార్యక్రమం ఉద్దేశ్యం. శేఖర్ సుమన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ జడ్జీలు. ఈ ప్రోగ్రామ్ ఓ మోస్తరుగా సక్సెస్ అయినా చాలు అనుకుంది యాజమాన్యం. కాని అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా సూపర్ డూపర్ హిట్ అయ్యి కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించి స్టార్ వన్ చానెల్‌ని తారాపథంలోకి తీసుకెళ్లింది. అందుకు కారణమైన ఏకైక వ్యక్తి- రాజూ శ్రీవాస్తవ్.


మిమిక్రీ చేయడం అంటే వాళ్లనూ వీళ్లనూ అనుకరించడం కాదనీ నిజజీవితాన్ని మిమిక్ చేసినవాడే సూపర్ స్టార్ అనీ నిరూపించాడు రాజూ శ్రీవాస్తవ్. పల్లె హాస్యం, వృద్ధుల హాస్యం, డబ్బున్నవాళ్ల హాస్యం, మాఫియా హాస్యం... రాజూ సంధించని అస్త్రం లేదు. ప్రదర్శించని వ్యంగ్యం లేదు.

రాజూ శ్రీవాస్తవ్‌ది కాన్పూర్. వాళ్ల నాన్న కవి. చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్‌ను స్కూల్‌లో మిమిక్ చేసి మార్కులు కొట్టేసిన రాజూ ఆ తర్వాత బాంబేలో బిగ్ స్టార్ అవుదామని కలలు కన్నాడు. కాని ఎక్స్‌ట్రా ఆర్టిస్టుగా మిగిలాడు. చిల్లర వేషాలు వేశాడు. చివరకు మ్యూజిక్ షోలలో కామిక్ రిలీఫ్ కోసం మిమిక్రీ ప్రదర్శించే హాస్యగాడయ్యాడు. ఎన్ని చేసినా పేరు రాలేదు.

సరిగ్గా 2006-07 ప్రాంతంలో స్టార్ వన్ గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ప్రారంభించింది. రాజు అందులో పాల్గొన్నాడు. ఇంతకు ముందు చూడని హాస్యం ఎవరూ చూపని హాస్యం రాజూ చూపడం వల్ల రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. పెళ్లిళ్లలో వ్యక్తుల ప్రవర్తన, టివిలలో యాంకర్ల ప్రవర్తన, రచ్చబండ దగ్గర ఊరి పెద్దల ప్రవర్తన... వీటిని కళ్లకు కట్టినట్టుగా హాస్యాన్ని మిక్స్ చేసి చూపడం వల్ల రాజు నేరుగా ప్రేక్షకులను తాకగలిగాడు. చివరకు అతడి షోల ప్రభావం ఎక్కడిదాకా వెళ్లిదంటే తరచూ దావూద్ ఇబ్రహీమ్‌ను హేళన చేస్తున్నాడని పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి.

రాజూ శ్రీవాస్తవ్ ఒకప్పుడు వెయ్యి రెండు వేలకు పని చేసేవాడు. ఇవాళ రోజుకు రెండు మూడు లక్షలు ఇస్తే తప్ప బయటకు రాడు. అతడి సక్సెస్ స్టోరీని ఎన్‌సిఇఆర్‌టి వాళ్లు ఎయిత్ క్లాస్ టెక్స్ట్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా చేర్చారు. అనేక న్యూస్ చానెల్స్ రేటింగ్స్ కోసం వార్తల మధ్యలో రాజూ జోక్స్ ప్రదర్శించడం మొదలుపెట్టాయంటే అతడి రేంజ్ అలాంటిది.

నవ్వించడం నవ్వులాట కాదు. దానిని సాధించాలనుకునేవారికి ఇంతకు ముందు గమ్యం ఏమిటో గాని ఇప్పుడు మాత్రం రాజు శ్రీవాస్తవే గమ్యం. హాస్యంలో రాజు అంతటివాడు కావడం అంటే పర్వతాలలో ఎవరెస్ట్ అంత కావడం.

No comments:

Post a Comment