Tuesday 27 September 2011

The Diary of LEKHA GUMMADI - 8 ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 8

ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 8
The Diary of LEKHA GUMMADI - 8


"నేనేమైనా మణులడిగానా, మాన్యాలడిగానా.. ఒకే ఒక మిరపకాయ బజ్జీ అడిగాను'' అంటూ సీనియర్ నటుడు కృష్ణ వాయిస్ ను అనుకరిస్తూ చేసిన కాసెట్.. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఆ డైలాగులు ఇప్పటికీ చెవుల్లో వినిపిస్తుంటాయి. అదేదో నా మెమొరీ పవర్ అనుకుంటే అంతకంటే జోక్ ఇంకోటి ఉండదు. గంటక్రితం తిన్న కూరే గుర్తుండదు నాకు. అవును, అవి గుర్తున్నాయంటే, ఖచ్చితంగా మిమిక్రీ ఆర్టిస్ట్ గొప్పతనమే. అందులో ఇంకా చాలామంది నటుల గొంతులు ఉన్నాయి. ఎవరికి వారిదే excellent.. వాళ్ళే స్వయంగా మాట్లాడుతున్నంత సహజంగా ఉంటుంది. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో గానీ.. హాట్సాఫ్ ! అతనే కాదు, టాలెంట్ ఉన్న ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ కీ నేను రుణపడిఉంటాను. ఈ మాటగానీ ఆ కళాకారులు వింటే, నేను వాళ్ళకి నిజంగానే బాకీపడ్డట్టు వచ్చి డబ్బులడగ్గలరు!


ఏమోగానీ, మిమిక్రీ చేసేవాళ్ళంటే చెప్పలేనంత క్రేజ్. మాంఛి నైపుణ్యం సంపాదిస్తే ఏ ఆర్టయినా గొప్పదే. అయితే, అన్నిటిలోకీ mimicry మరీ అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరిదో వాయిస్ ని అచ్చం వాళ్ళదే అనిపించేట్టు అనుకరించడం వండర్ కాదా మరి?!

ఏదో కుక్క, పిల్లి, రైలు, ఏడ్పు లాంటి అతి సాధారణమైన ధ్వనులైతే ఎవరైనా ఇమిటేట్ చేయొచ్చు, చేస్తుంటారు కూడా! కానీ, సింహ గర్జన, ఏనుగు ఘీంకారం వేయి జన్మలెత్తినా మామూలువాళ్లకి అనుకరించడం సాధ్యం కాదు. అందునా వేరేవాళ్ళ గొంతును, ముఖకవళికల్ని అనుకరించడం అంటే అస్సలు ఈజీ కాదు.

అక్కినేని నాగేశ్వర్రావు, గుమ్మడి వేంకటేశ్వర్రావు, చంద్రబాబు నాయుడు, రోశయ్య లాంటి సెలెబ్రిటీలు సినిమాల్లోనో, మీటింగుల్లోనో మాట్లాడిన డైలాగుల్ని as it isగా ఇమిటేట్ చేయడం ఒక ఎత్తు. వాళ్ళ మాటతీరు, మ్యానరిజాలను అనుకరిస్తూ మరింత తమాషాగా, హాస్యం పండిస్తూ తాజాగా సీన్లు వండి వడ్డించడం ఇంకో ఎత్తు. అంటే, ఈ రకపు మిమిక్రీ ఆర్టిస్టులో కేవలం హాస్య ప్రవృత్తే కాదు, actor, writer, singer కూడా దాగి ఉన్నట్టేగా!

కార్టూనిస్ట్ బలరాం మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. CSR ఆంజనేయులు, రావుగోపాలరావు, ఎల్బీ శ్రీరాం, ప్రకాష్ రాజ్ లాంటి ఉద్ధండ నటుల సంగతి అలా ఉంచి ఒకసారి సీనియర్ నటి భానుమతిని ఇమిటేట్ చేస్తే నమ్మశక్యం కాలేదు. మేల్ వాయిస్ తో ఫీమేల్ వాయిస్ ని.. అదీ అంత నాచురల్ గా అనుకరించడం మామూలు సంగతా?! ఆ ఆశ్చర్యంలోంచి ఆనందం పొంగుకొచ్చింది.

ఇక మిమిక్రీ రమేష్.. చాలాసార్లు ఇంటికి వెళ్ళేప్పుడు కలిసే వెళ్ళేవాళ్ళం.. దారి పొడుగునా ఎవరెవర్నో అనుకరించేవారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్ళ పక్కన నడుస్తున్నట్టే ఉండేది. స్పాంటేనియస్ గా సీన్లు క్రియేట్ చేసి నవ్వించేవారు.

లోకంలో మిమిక్రీ చేసేవాళ్ళు ఎక్కువమంది ఎందుకు ఉండరు - అని చాలాసార్లు అనుకుంటాను. చచ్చుపుచ్చు ఇమిటేషన్ల సంగతి కాదు. కోటిమందిలో ఒక్కరు మాత్రమే మిమిక్రీ చేయగలరనుకుంటా. తెలుగులో నేరెళ్ళ వేణు మాధవ్, శివారెడ్డి, మిమిక్రీ హరికిషన్ - ఇలా వేళ్ళమీద లెక్కపెట్టేంత కొద్దిమంది అనుకరణ కళాకారులు ఉన్నారు. బహుశా ఈ కళ నేర్చుకున్నా రాదేమో! మామూలు చెట్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి, కానీ గంధపు చెట్లు చాలా rare. నిజాయితీపరులు కూడా అంతే చాలాచాలా అరుదు, వెతికి చూసినా దొరకరు! గులకరాళ్ళు రోడ్డు పొడుగూతా ఉంటాయి గానీ వజ్రవైఢూర్యాలు అలా ఆరబోసి ఉంటాయా?! మిమిక్రీ కూడా అంతే! మళ్ళీ జన్మంటూ ఉంటే మాంఛి మిమిక్రీ ఆర్టిస్టుగా పుట్టి ప్రపంచప్రఖ్యాతమైపోతా!
___+++___

No comments:

Post a Comment